Poverty: దేశంలో ఆర్థిక అభివృద్ధి మార్పులు..! 2 d ago
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 25.7 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం 2023-24లో 4.86 శాతానికి తగ్గితే, ఇదే సమయంలో పట్టణ పేదరికం 13.7 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గింది. వార్షికంగా చూస్తే, 2022-23లో 7.2 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం 2023-24 లో 4.86 శాతానికి చేరితే, పట్టణ పేదరికం 4.6 శాతం నుంచి 4.09 శాతానికి పరిమితమైంది. భారతదేశంలో పట్టణ పేదరికం ఇప్పుడు 4-4.5 శాతం పరిధిలో ఉండవచ్చని సర్వే భావించింది.
పేదరికం తగ్గడానికి కారణాలు..
ప్రత్యక్ష నగదు బదిలీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు, గ్రామీణ జీవన ప్రమాణాల్లో మెరుగుదల వంటి చర్యలు దేశంలో పేదరికం తగ్గడానికి దోహదపడ్డాయి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో వినియోగ వృద్ధి పెరిగి, గ్రామీణ పేదరిక నిష్పత్తి తగ్గింది.
వినియోగం, వ్యయాలపై ఎస్ బీఐ సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు..
ప్రభుత్వ పథకాల మద్దతుతో దిగువ ఆదాయ వర్గాల వ్యయాల్లో 5% వరకూ పెరుగుదల కనిపించింది. ఆహార ధరల స్థిరత్వం వల్ల ఖర్చులు తగ్గాయి. ఆహార ద్రవ్యోల్బణం వల్ల అధిక ఆదాయ రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఆదాయ రాష్ట్రాల్లో వినియోగం గిరాకీపై ప్రతికూల ప్రభావం పడింది. ఎక్కువ శాతం అధిక ఆదాయ రాష్ట్రాల్లో పొదుపు రేటు, జాతీయ సగటు (31%) కంటే ఎక్కువగా ఉంది. వలసల వల్ల ఉత్తరప్రదేశ్, బీహార్లలో పొదుపు రేటు తక్కువగా ఉంది. 2023-24లో పేదరిక రేఖ గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,632గా, పట్టణ ప్రాంతాల్లో రూ.1,944గా ఉందని అంచనా(ఒక వ్యక్తి కనీస అవసరాలు తీరటానికి నెలకు అయ్యే సగటు ఖర్చునే దారిద్య్రరేఖగా నిర్ణయిస్తారు).
పేదరిక నిర్మూలకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు..
• జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
• ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
• ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
• జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన
• జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్
• జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్
• ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన
• జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (నోప్స్)
• ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)
• సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (సాగి)